Read In Tollywood Latest News

Sunday, July 15, 2012

జైలు నుండే చక్రం తిప్పుతున్న వైయస్ జగన్..........


 Jagan Is Leading Party From Jail
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండే చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ మే 27వ తేదిన అరెస్టైన విషయం తెలిసిందే. అప్పటి నుండి పార్టీ వ్యవహారాలని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చూస్తున్నారు. ఇటీవలే ఆమె పార్టీ అనుబంధ కమిటీలను కూడా ప్రకటించారు.

అంతకుముందు ఉప ఎన్నికలలో తన తనయ షర్మిలతో కలిసి జోరుగా ప్రచారం చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అత్యధిక స్థానాలలో గెలిపించారు. జూలై 19న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజయమ్మకు ఫోన్ చేశారు. మరో అభ్యర్థి పిఎ సంగ్మా కూడా విజయమ్మను కలిసి మద్దతు కోరారు. జగన్‌ను కలిసేందుకు వెళ్లగా జైలు అధికారులు నిరాకరించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ దాదాకే మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ దాదాకు మద్దతివ్వడమే మంచిదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో అధికార కాంగ్రెసును, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ధీటుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. అరెస్టుకు ముందు జగన్ పలు దీక్షలు, ఓదార్పు యాత్రలు చేపట్టారు. ఇప్పుడు విజయమ్మ దానిని పూరించనుంది.
ఈ నెల 23న చేనేత కార్మికల కోసం ఆమె సిరిసిల్లలో దీక్ష చేపట్టనున్నారు. సిరిసిల్లలో దీక్ష ద్వారా తెలంగాణలో టిఆర్ఎస్‌ను సవాల్ చేసే దిశగా వైయస్సార్ కాంగ్రెసు వెళుతోంది. ఇటీవల పరకాల ఉప ఎన్నికలలో ఓడినప్పటికీ అక్కడి ఆదరణ జగన్ పార్టీలో మంచి ఉత్సాహాన్ని నింపింది. అయితే పార్టీ చేపడుతున్న ప్రతి కార్యక్రమం, ప్రతి నిర్ణయం జైలులో ఉన్న జగన్ నిర్ణయం ప్రకారమే జరుగుతోంది!

జైలులో ఉన్నప్పటికీ తనను మిలాఖత్‌లో భాగంగా కలిసేందుకు వస్తున్న తన తల్లి విజయమ్మతో, ఇతర పార్టీ నేతలతోనూ జగన్ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల పైనే ప్రధానంగా చర్చిస్తున్నారట. ఇప్పటికే సీమాంధ్రలో జగన్ జోరు ఉంది. ఇక తెలంగాణలోనూ తన సత్తా చాటేందుకే జగన్ తన తల్లిచే చేనేత దీక్ష చేయిస్తున్నారని అంటున్నారు. ఈ దీక్ష వ్యూహం జగన్ మదిలోదే అని తెలుస్తోంది.

పలు కోణాల నుండి ఆలోచించిన తర్వాతే జగన్ యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతిస్తామని సంకేతాలు ఇచ్చారని, అందువల్లే వైయస్సార్ కాంగ్రెసు అటు వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని అంటున్నారు. తాను ఎన్ని రోజులు జైలులో ఉంటానో తెలియని పరిస్థితులలో జగన్ పార్టీ భవిష్యత్తు కోసం జైలు నుండే వ్యూహరచన చేస్తూ తన నేతల ద్వారా అమలు పరుస్తున్నారని అంటున్నారు.

No comments:

Post a Comment