Read In Tollywood Latest News

Thursday, July 19, 2012

జగన్, కెసిఆర్‌ల స్నేహం ముణ్నాళ్ల ముచ్చట!?.......


Wary Trs Scuttle Ysrc Adventurism
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య స్నేహ బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే ముగిసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తన పట్టు పెంచుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన దృష్టి మరల్చడం తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని అంటున్నారు.

జగన్ తెలంగాణలో కాలుమోపడం అసలు ఇష్టం లేని తెరాస వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్లలో చేపట్టబోతున్న చేనేత దీక్షపై మండిపడుతున్నారు. గతంలోనూ జగన్ తెలంగాణ జిల్లాల్లో దీక్ష చేపట్టారు. కానీ దానికి ఇప్పటి దానికి తేడా ఉందని అంటున్నారు. ఇటీవలి వరకు ఇటు జగన్ పార్టీ నేతలు, అటు తెరాస కూడా భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో కెసిఆర్, సీమాంధ్రలో జగన్ క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పేవారు.

2014 ఎన్నికలలో తెరాస, వైయస్సార్ కాంగ్రెసులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటే ఇరుపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తాయనే వాదనలు వినిపించాయి. అయితే పరకాల ఉప ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. జగన్ కాంగ్రెసులో ఉండగా లోకసభలో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నాడు. అదే సమయంలో ఓదార్పు కోసం మహబూబాబాద్ వచ్చారు. అప్పుడు తెరాస ఆయనను రాకుండా అడ్డుకుంది. అయితే జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించాక తెలంగాణ గురించి మాట్లాడలేదు.

జగన్ సీమాంధ్రకే పరిమితమవుతాడని భావించిన తెరాస అక్కడ జగన్ ఇక్కడ తాము అని భావించారు. అందుకే ఆయన హైదరాబాదులో చేపట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ దీక్షను గానీ, ఆర్మూర్ దీక్షను కానీ అడ్డుకోలేదు. అంతేకాదు హైదరాబాద్ జగన్ దీక్షకు తెరాస పరోక్షంగా సహకరించిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ ఇరు పార్టీలు ఇటీవలి వరకు ఒకరిపై మరొకరు ఘాటుగా విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవు. తెలంగాణపై వైఖరి తేల్చాలని కాంగ్రెసు, టిడిపిలపై మండిపడే తెరాస నేతలు జగన్ విషయంలో మాత్రం మొక్కుబడిగా వ్యవహరించే వారనే వాదనలు ఉన్నాయి. అందుకు వారి మధ్య ఉన్న అండర్‌స్టాండింగే కారణమని తెలుగుదేశం పార్టీ ఆరోపించేది.
కానీ ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో టిడిపి, కాంగ్రెసు, తెలంగాణ వాదం జాతీయస్థాయిలో వినిపిస్తున్న బిజెపిని కాదని పరకాల ప్రజలు కొండా సురేఖకు భారీ ఓట్లు వేశారు. తెరాస గెలిచినా పరువు పోగొట్టుకుంది. జగన్ పార్టీ ఓడినా తన పట్టు చూపించుకుంది. పరకాల ప్రజలు తమ పార్టీకి భారీగా మద్దతు పలకడంతో జగన్ తన వ్యూహాన్ని మార్చారని అంటున్నారు. పార్టీ స్థాపించి సంవత్సరం దాటినా తెలంగాణ వైపు అంతగా చూడని జగన్ పరకాల ఉప ఎన్నికలలో తన పార్టీ బలం తెలియడంతో ఇక్కడ కూడా పాగా వేయాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే విజయమ్మ సిరిసిల్ల దీక్ష. అందులోనూ తెరాస అధినేత తనయుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం సిరిసిల్ల. ఇది తెరాసకు మరింత ఆగ్రహం కలిగించింది. తెలంగాణలో ప్రస్తుతం తెరాసనే బలంగా ఉంది. దీంతో దానినే దెబ్బతీయాలనే పక్కా వ్యూహంతో జగన్ ఆ ప్రాంతంలో అడుగు పెడుతున్నారని అంటున్నారు. జగన్ తెలంగాణలో అడుగుపెడితే అందరికంటే ఎక్కువగా నష్టపోయేది తెరాసయే. సంవత్సరంన్నరగా జగన్ పైన అంతగా స్పందించని తెరాస విజయమ్మ దీక్ష ప్రకటన అనంతరం తీవ్రంగా మండిపడుతోందని అంటున్నారు. గతంలో జగన్ దీక్షలను అడ్డుకోని తెరాస ఇప్పుడు విజయమ్మ దీక్షను అడ్డుకుంటామని చెబుతోంది.

No comments:

Post a Comment