Tuesday, August 21, 2012

కిరణ్ 15 రోజులేనన్న శంకరన్న....

 Shankar Rao Supports Trs Leaders
విద్యుత్ కోతకు నిరసనగా ధర్నా చేసి అరెస్టయిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులను మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు మంగళవారం పరామర్శించారు. తెరాస శానససభ్యులు ఈటెల రాజేందర్, హరీష్ రావు తదితరులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని పరామర్సించిన శంకర రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉండేది 15 రోజులు మాత్రమేనని, పోయేలోగానైనా మంచిపనులు చేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తీరు వల్లనే తెలంగాణలో అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోందని ఆయన విమర్శించారు. వచ్చే 48 గంటల్లో విద్యుత్తు సమస్యను పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ, సీమాంధ్రలను రెండు కళ్లుగా చూడాలని, కానీ కిరణ్ కుమార్ రెడ్డి అలా చూడడం లేదని ఆయన అన్నారు.

పోలీసుల ద్వారా నోరు నొక్కేస్తామని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎంత ధరైనా సరే విద్యుత్తు కొనుగోలు చేసి అందించాలని, పంపిణీలో వృధాను అరికట్టాలని ఆయన అన్నారు. తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తారా అని ఆయన అడిగారు. దండం పెడుతున్నా, ఉండే 15 రోజులైనా మంచి పనులు చేసి పేరు కాపాడుకోండి అని ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ నగారా సమితి నాయకుడు, శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించని ముఖ్యమంత్రిని ప్రజలు ఇంటి బాట పట్టిస్తారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికల పేరు చెప్పి తెలంగాణపై నిర్ణయం తీసుకునే విషయాన్ని కాంగ్రెసు అధిష్టానం వాయిదాల మీద వాయిదాలు వేస్తోందని ఆయన అన్నారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, జెఎసిలు ఒక్కటై ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు.

సమస్యలపై ఆందోళనలు చేస్తూనే తెలంగాణ కోసం నిరంతర పోరాటం చేయాలని, అందరూ ఒక్కటై ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. తెరాస, బిజెపి, సిపిఐ, న్యూడెమొక్రసీ, జెఎసిలు, ప్రజా సంఘాలు ఒక్కటై తెలంగాణ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment