Wednesday, July 4, 2012

మంత్రి డికె అరుణ అమెరికా యాత్రపై వివాదం............


 Row Over Dk Aruna Us Visit
సమాచార, పౌర సంబంధాల మంత్రి డికె అరుణ అమెరికా యాత్రపై వివాదం చోటు చేసుకుంది. మంత్రులు, అధికారుల విదేశీ యాత్రలపై నిషేధం ఉన్నప్పటికీ అరుణకు అనుమతి లభించిందంటూ వార్తలు వచ్చాయి. అమెరికా తెలుగు సంఘం (ఆటా) 12వ సదస్సుకు ఆమె హాజరవుతున్నారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు అట్లాంటాలో ఈ సదస్సు జరుగుతోంది. అరుణ అమెరికా యాత్రను అధికారిక ప్రకటనగా పేర్కొంటూ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందంటూ జిఎడి ప్రత్యేక కార్యదర్శి (ప్రోటోకాల్) ఎన్వీ రమణమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఆమె పర్యటనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఇప్పటికే అరుణ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ప్రయాణ సమయాలను వదిలేస్తే అరుణ 16 రోజులు అమెరికాలో ఉంటారని తెలుస్తోంది. ఆటా సదస్సుకు రాష్ట్ర సాంస్కృతిక ప్రతినిధిగా అరుణ హాజరవుతున్నారని, అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వట్టి వసంతకుమార్ పర్యాటక, సాంస్కృతిక శాఖను నిర్వహిస్తున్నారని వార్తాకథనాలు వచ్చాయి. ఆటా సదస్సు 8వ తేదీతో ముగుస్తున్నప్పటికీ ఆమె 18వ తేదీ వరకు అమెరికాలో ఉంటున్నారు. గ్లోబల్ కాన్ఫరెన్స్‌కు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో అరుణ కోసం నిబంధనలను సడలించినట్లు రమణమూర్తి చెప్పినట్లు ఓ పత్రిక రాసింది.
ఆ వివాదంపై సమాచార, పౌరసంబంధాల కమిషనర్ ఆర్వి చంద్రవదన్ వివరణ ఇచ్చారు. అరుణ అమెరికా పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చంద్రవదన్ చెప్పారు. ఆటా సమ్మేళనం యువజన సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా హాజరవుతున్నారని చెప్పారు. ఈ మేరకు చంద్రవదన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అరుణ అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ అనుమతి వచ్చిందని చెప్పారు.
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు నైతిక మద్దతు కోసం, స్ఫూర్తి కోసం మంత్రులను ఇటువంటి సమ్మేళనాలకు ప్రభుత్వం పంపించడం పరిపాటి అని చెప్పారు. అరుణ ప్రయాణం ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని, వసతి, భోజనం, ఇతర సౌకర్యాలన ఖర్చులను ఆటా భరిస్తుందని స్పష్టం చేశారు. ముందుగా ప్రభుత్వం నుంచి అరుణ ఏ విధమైన డబ్బులు తీసుకోలేదని చెప్పారు. విమానం టికెట్లను సమర్పించి తిరిగి వచ్చిన తర్వాత విమాన ప్రయాణం ఖర్చులను మాత్రమే అరుణ తీసుకుంటారని చెప్పారు.
అరుణ ప్రయాణ ఖర్చులు ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారం కాదని, ప్రభుత్వ, విదేశాల్లోని తెలుగు ప్రజల ప్రయోజనాల కోసమే అరుణ అమెరికా వెళ్లారని చంద్రవదన్ చెప్పారు.

No comments:

Post a Comment